మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్‌పర్సన్ జ్యోతికి, ఆ పార్టీ కౌన్సిలర్లకు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాకముందే, పాలకవర్గంలో వర్గ విభేదాలు తలెత్తడంతో మున్సిపల్ కార్యాలయం రెండు వర్గాలుగా విడిపోయింది.

తాను ఎన్నికల కోసం ఎంతో ఖర్చు చేశానని, కనీస మర్యాద కూడా దక్కడం లేదని చైర్‌పర్సన్ జ్యోతి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు, తమ వార్డుల్లో చైర్‌పర్సన్ పెత్తనం చేస్తున్నారని, తమకు సమాచారం ఇవ్వకుండానే పర్యటనలు చేస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

ప్రతి వార్డుకు ప్రభుత్వం కేటాయించిన రూ. 5 లక్షల నిధుల ఖర్చులో కూడా వివాదాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పనుల కేటాయింపుల్లో చైర్‌పర్సన్ జోక్యం చేసుకుంటున్నారని, అధికారులను నిందిస్తున్నారని కౌన్సిలర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో చైర్మన్లు అందరినీ కలుపుకొని పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జ్యోతి వాదిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న నిర్మాణాలకు చైర్‌పర్సన్ అనుమతులు ఇస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. తమ అనుచరుల భవనాలను కూల్చివేసేందుకు చైర్‌పర్సన్ అధికారులను పంపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు గుర్రుగా ఉన్నారు. పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు తాము కష్టపడి పనిచేశామని, ఇప్పుడు తమ వార్డుల్లో ఆమె జోక్యం ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు చెబుతున్నారు.

ఈ వివాదంపై ఇప్పటికే ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా వద్ద ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఈ పంచాయితీని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.