లూథియానాలోని ఘంటా ఘర్ చౌక్ సమీపంలో అర్ధరాత్రి ఈ కాల్పులు జరిగాయి. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా రమీందర్ సింగ్ అలియాస్ సోను, అతని స్నేహితుడు సంజీవ్ ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. ఆ తర్వాత కారులో వచ్చిన వారు కాల్పులు జరిపి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

ఈ కాల్పుల్లో రమీందర్ మెడకు బుల్లెట్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న సంజీవ్ చేతికి బుల్లెట్ తగలడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసే ప్రాథమిక నివేదిక) నమోదు చేశారు.

సంజీవ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, కాల్పులకు కొద్దిసేపటి ముందు వారు JMD మాల్ వద్ద ఆగారు. అక్కడ ఒక స్కూటర్ రైడర్‌కు, కారు డ్రైవర్‌కు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి వారు ప్రయత్నించారు. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాతే వారు తమ ఇంటికి బయలుదేరారు.

అయితే, వారు వెళ్తుండగా ఒక క్రెటా కారు వారిని దాటి ముందుకు వెళ్లి, ఆ తర్వాత కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనను రోడ్డుపై జరిగే గొడవగా, అంటే రోడ్ రేజ్‌గా పరిగణిస్తున్నట్లు నగర అదనపు డీసీపీ సమీర్ వర్మ తెలిపారు.

నిందితులను గుర్తించామని, వారిని పట్టుకోవడానికి పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని సమీర్ వర్మ చెప్పారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.