సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్, అదే పార్టీకి చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో కనీస ప్రోటోకాల్ పాటించకుండా పర్యటించడంపై సామేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాననే విషయం మంత్రికి తెలియడం లేదని, ఎస్సీ నియోజకవర్గాల పట్ల వారు వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. మాదిగలు ఎవరికీ బానిసలు కాదని స్పష్టం చేసిన సామేల్, ఇదే పరిస్థితి కొనసాగితే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ వీడి బీజేపీలోకి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని సామేల్ నిలదీశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తీరుపై తమకు పూర్తి రిపోర్టు ఉందని, ఇతరుల నియోజకవర్గాలపై పెత్తనం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. నల్గొండ జిల్లా ఎవరి సొంత రాజ్యమూ కాదని, ఇది శ్రమజీవుల జిల్లా అని ఆయన వ్యాఖ్యానించారు.
తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అహంకార పూరిత రాజకీయాలను చావుదెబ్బ తీస్తామని సామేల్ ఘాటుగా హెచ్చరించారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి తామే డప్పులు కొడతామని, తమ దండోరా మోగుతుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజల అభిమానంతోనే గెలిచామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








