భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి ముందు న్యూఢిల్లీలో 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రధాన తారాగణం అంతా పాల్గొని సందడి చేశారు.
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యష్ కనిపిస్తుండగా, ఆయన తన 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' ద్వారా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. వీరితో పాటు శోభన, అజింక్య దేవ్, కునాల్ కపూర్, రవీ దూబే, రకూల్ ప్రీత్ సింగ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'దంగల్' చిత్ర దర్శకుడు నితేశ్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణంలోని మానవీయ భావోద్వేగాలను, ప్రామాణికతను తెరపై నిజాయితీగా ఆవిష్కరించడమే తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, వేల ఏళ్లుగా నిలిచిన విలువలను ప్రేక్షకులు అనుభవిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.







