ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ మ్యాచ్‌లో యార్క్‌షైర్ జట్టు 106 పరుగుల తేడాతో ఎసెక్స్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేయగా, ఎసెక్స్ జట్టు 171 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎసెక్స్ జట్టు ఫాలో ఆన్ (తొలి ఇన్నింగ్స్‌లో భారీగా వెనుకబడటంతో రెండోసారి బ్యాటింగ్ చేయడం) ఆడాల్సి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఎసెక్స్ జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి మొత్తం 10 వికెట్లతో సత్తా చాటాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన బంతి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ ఓవర్‌లో కుల్దీప్ ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా బంతిని విసిరాడు. ఆ బంతిని ఆడటం ఎందుకులే అని బ్యాటర్ జమాన్ అక్తర్ వదిలేయగా, అది అనూహ్యంగా తిరిగి వచ్చి నేరుగా స్టంప్‌ను పడగొట్టింది. ఈ బంతిని చూసి బ్యాటర్లతో పాటు మైదానంలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.
కుల్దీప్ బౌలింగ్ తీరు స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను గుర్తు చేస్తోందని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కుల్దీప్ బౌలింగ్‌ను చూసి స్వర్గంలో షేన్ వార్న్ సంబరపడుతున్నారని, కుల్దీప్ రూపంలో వార్న్ తన ఆటను అభిమానులతో పంచుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుల్దీప్ విసిరే బంతులను వదిలేయడం కూడా ప్రమాదకరమని వారు అభిప్రాయపడుతున్నారు.








