కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న ఇబ్బందులను వెంటనే తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొజ్జ చిన వెంకులు డిమాండ్ చేశారు. సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థినులతో కలిసి భోజనం చేసి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ప్రస్తుతం పాఠశాలలో 436 మంది విద్యార్థినులు ఉండగా, వారికి కేవలం 20 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే, వంట పనుల కోసం ఆరుగురు సిబ్బంది మాత్రమే పనిచేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మరుగుదొడ్ల సంఖ్యను 50కి పెంచాలని, అదనంగా మరో ఇద్దరు వంట సిబ్బందిని నియమించాలని కోరారు.
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్ చార్జిలను పెంచాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇటికాల సురేందర్, చింత సందీప్ పాల్గొన్నారు.






