రాజస్థాన్‌లోని నెవాయి గ్రామానికి చెందిన మంగిలాల్ అనే రైతు తన భూమిని విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలను దొంగల భయంతో పొలంలో పాతిపెట్టారు. అయితే, ఆ డబ్బును ఎక్కడ దాచారో మర్చిపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు ఆరు ఎకరాల పొలంలో పలుచోట్ల తవ్వినా ఫలితం లేకపోయింది.

ఏడాది తర్వాత, పొలంలో విత్తనాలు నాటేందుకు భూమిని దున్నుతుండగా రైతుకు డబ్బుల సంచి కనిపించింది. తన డబ్బు తనకు దక్కిందనే ఆనందంతో మంగిలాల్ కుటుంబ సభ్యులు ఆ సంచిని బయటకు తీశారు. కానీ, సంచిని తెరిచి చూడగా అందులోని నోట్లన్నీ చెదపురుగులు తినేసి ముక్కలై ఉన్నాయి.

దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. పాడైపోయిన ఆ నోట్లను స్థానిక ఎస్బీఐ (SBI) బ్యాంక్ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అయితే, ఆ నోట్లను తీసుకునేందుకు బ్యాంక్ సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక రైతు కుటుంబం నిరాశతో వెనుదిరిగింది.