నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీకి విదేశీ నిధులు అందుతున్నాయని వస్తున్న ఆరోపణలపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందించింది. శుక్రవారం జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
ఈ నిరసనల్లో విదేశీ ప్రమేయం లేదా విదేశీ నిధుల సంబంధం ఉన్నట్లు తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ ప్రకటనతో ఆ పార్టీకి విదేశీ నిధులు అందుతున్నాయని ప్రచారం చేసిన వారి ఆరోపణలకు కేంద్రం చెక్ పెట్టినట్లయింది.
మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ఆలోచనతో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైంది. ఇది అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినా, సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్ మీడియా వేదికగా యువతలో మంచి గుర్తింపు పొందింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో భాగంగానే నీట్ పేపర్ లీక్ అంశంపై ఈ పార్టీ జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగింది.








