ఈజిప్టు రాజధాని కైరోలో ఒక ఫ్యాక్టరీ నుంచి నాలుగు టన్నుల ఫ్రీజ్ చేసిన (గడ్డకట్టిన) చికెన్‌ను ట్రక్కులో తరలిస్తుండగా ఈ చోరీ జరిగింది. కదులుతున్న ట్రక్కును వెంబడించిన దొంగల ముఠా, ఎవరికీ అనుమానం రాకుండా వాహనంపైకి ఎక్కింది.

ట్రక్కు వెనుక వైపు ఉన్న డోరును తెరిచిన దుండగులు, అందులోని చికెన్ డబ్బాలను కిందకు విసిరి చోరీకి పాల్పడ్డారు. ట్రక్కు డ్రైవర్‌కు అసలు చోరీ జరుగుతున్నట్లు కూడా తెలియలేదు. చివరకు తన వాహనం నుంచి 105 కిలోల చికెన్ మాయమైనట్లు డ్రైవర్ గుర్తించాడు.

ఈ చోరీని వెనుక వస్తున్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది విస్తృతంగా వ్యాపించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆరుగురు అనుమానితులను గుర్తించారు.

నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులు మరణించగా, మిగిలిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.