బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ కావడానికి కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కుల్లో గెలిచిన ఝాన్సీ, ముకేశ్, అమన్, షాలినిలు కెప్టెన్సీ రేసులో తదుపరి దశకు చేరుకున్నారు.
నేటి ఎపిసోడ్ కోసం విడుదలైన ప్రోమోలో, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు జంతువుల ఆధారిత టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను జంటలుగా విభజించి, ఒకరు జంతువులా నటిస్తుంటే, మరొకరు అది ఏ జంతువో గుర్తించి దానికి సంబంధించిన బాక్సులను అమర్చాల్సి ఉంటుంది.
ఈ టాస్క్ లో ఝాన్సీ, ముకేశ్ జంటగా, అమన్, షాలిని జంటగా ఆడారు. ఇందులో ఝాన్సీ, ముకేశ్ విజయం సాధించారు. గెలిచిన వారికి, మిగిలిన ఇద్దరు పోటీదారులలో ఒకరిని కెప్టెన్సీ గేమ్ నుంచి తొలగించే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ముకేశ్, అమన్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాడు. దీంతో అమన్, షాలినిల మధ్య గొడవ మొదలైంది. ఆటలో ఒకరిపై ఒకరు తప్పులు ఎంచుకుంటూ ఇద్దరూ తీవ్రంగా వాదించుకున్నారు.
ఇన్నాళ్లుగా కలిసి గ్రూపుగా ఆడుతున్న 'అగ్నిపరీక్ష' బ్యాచ్ సభ్యుల మధ్య గొడవ జరగడం ఇదే మొదటిసారి. నిన్నటి ఎపిసోడ్ లోనే తామంతా ఒకే గ్రూపు అని చెప్పుకున్న వీరు, నేడు ఇలా గొడవ పడటం గమనార్హం.








