వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు జైతాపూర్ గ్రామంలో బుధవారం విస్తృత పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగుల రాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ పనుల్లో నయాబాది సమీపంలోని శ్మశాన వాటిక ఆవరణను పూర్తిగా శుభ్రం చేశారు.
ఈ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తతో పాటు, పాత ట్రాక్టర్ పరికరాలు మరియు నిరుపయోగంగా ఉన్న సామగ్రిని సిబ్బంది తొలగించారు. శ్మశాన వాటిక పరిసరాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ నాగుల రాజు గౌడ్ తెలిపారు.
గ్రామాభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. దోమలు, ఈగల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామంలో పారిశుధ్య పనులను మరింత విస్తృతం చేస్తామని, పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
సర్పంచ్ చేపట్టిన ఈ పారిశుధ్య కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







