సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన ఈ ఆధునీకరణ పనులు 65 శాతం మేర పూర్తయ్యాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రూ. 714.73 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం ఈ స్టేషన్ ద్వారా ప్రతిరోజూ 180 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు అంతస్తుల ఎయిర్ కాన్‌కోర్స్, స్కైవాక్‌లు, మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు స్టేషన్ భవనం, రాక-పోకల ప్రాంతాలను ఆధునిక శైలిలో నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో, త్వరలోనే ప్రాజెక్టు పూర్తి కానుంది.