తెలుగు సినిమాల్లో వందల సంఖ్యలో కరడుగట్టిన విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను వణికించిన నటుడు త్యాగరాజు గురించి 1970-90 తరం వారికి బాగా తెలుసు. తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన ఆయన స్టేజి నాటకాలు, క్రికెట్‌లో రాణించిన తర్వాత సినిమాల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లారు.
అక్కడ దర్శకుడు ప్రత్యగాత్మను కలిసిన త్యాగరాజుకు 1964లో 'మంచి మనిషి' సినిమాతో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత 'పల్నాటి యుద్ధం', 'రంగుల రాట్నం', 'పట్టుకుంటే పదివేలు', 'చిక్కడు దొరకడు', 'జేమ్స్‌బాండ్ 777' వంటి 130కు పైగా చిత్రాల్లో ప్రతినాయకుడిగా, సాత్విక పాత్రల్లోనూ మెప్పించారు.
సుమారు 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో చెరగని ముద్ర వేసిన త్యాగరాజు కేవలం 50 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు. 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని అశోక్‌నగర్‌లో ఉన్న సోదరుని ఇంట్లో ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో త్యాగరాజు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నటించిన చివరి చిత్రం 'ప్రేమ ఖైదీ' 1991లోనే విడుదలై సంచలన విజయం సాధించింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హరీష్, మాలాశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు.








