తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ అడుగుల తర్వాత, రాష్ట్రంలోని ఇతర అగ్ర హీరోలు కూడా తమ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటే, రాజకీయాల్లో రాణించవచ్చని నటులు భావిస్తున్నారు.

ధనుష్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై, గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, విశాల్ తన సినీ కెరీర్ ద్వారా సంపాదించిన పేరును ప్రజల సేవకు ఉపయోగిస్తానని ప్రకటించారు. నిజాయితీగా ప్రజలకు అండగా ఉంటానని ఆయన చెప్పడం, ఆయన రాజకీయ ఎంట్రీని స్పష్టం చేస్తోంది.

సూర్య కూడా తన సినిమాల ఎంపిక ద్వారా రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 'యువ' నుంచి 'జై భీమ్', 'సూరారై పోట్రు' వరకు సామాజిక సందేశం ఉన్న చిత్రాల్లో నటించిన ఆయన, 'కరుప్పు' సీక్వెల్ ద్వారా రాజకీయ నేపథ్యాన్ని స్పష్టం చేశారు. అజిత్ విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో ఆయనకున్న సంబంధాలు రాజకీయాల్లో ఆయనకు కలిసి వచ్చే అంశం. అయితే, అజిత్ మనసులో ఏముందనేది ఇంకా స్పష్టత లేదు.

శివ కార్తికేయన్, లారెన్స్ వంటి నటులు, పలువురు టెక్నీషియన్లు కూడా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. గతంలో విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ ద్వారా కొంత మైలేజ్ సాధించినా, ఆ తర్వాత ఆ ఫామ్ కొనసాగలేదు. ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో, మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తూ హీరోలు తమకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు.