హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ఫంక్షన్‌హాల్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి సుమారు 600 మంది అభిమానులు హాజరయ్యారు. హాజరైన వారంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో కనిపించగా, వేదికపై ‘AAFA’ పేరుతో బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్ దాదాపు ఆరు గంటల పాటు అభిమానులతో గడిపి, వారందరితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు.
అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ, తోటి హీరోలను గౌరవించాలని, సోషల్ మీడియాలో ట్రోలింగ్, ద్వేషపూరిత ప్రచారాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నచ్చని వారిని విమర్శించే బదులు వారిని వదిలేయాలని, ఆ సమయాన్ని, డబ్బును తమ కెరీర్, కుటుంబం కోసం కేటాయించాలని సూచించారు. పరిశ్రమలో హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు అభిమానుల మధ్య కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వచ్చిన 600 మంది అభిమానులకు అసోసియేషన్ తరఫున ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీని అందించారు.
గతంలో ‘AAA’ పేరుతో ఉన్న ఫ్యాన్స్ క్లబ్‌ను ఇప్పుడు ‘AAFA’గా మార్చినట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఈ తరహా సమావేశాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, కేరళ తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయని, మున్ముందు ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. కార్యక్రమం చివరలో ఎక్స్‌లో స్పందిస్తూ, అభిమానులు గర్వపడేలా భవిష్యత్తులో మరిన్ని అడుగులు వేస్తానని పేర్కొన్నారు. పూరి జగన్నాథుని విగ్రహాన్ని బహుకరించేందుకు వచ్చిన అభిమాని కోసం, బన్నీ తన షూస్ తీసి మరీ ఆ విగ్రహాన్ని స్వీకరించడం విశేషం.








