అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం కింద ఇరాన్ రహస్యంగా అణు కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అణు కార్యకలాపాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఇప్పటివరకు ఇరాన్‌పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే అసలు సినిమా చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 1,000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని, దీనిని ఉపయోగించి పికాక్స్ పర్వతం కింద అణు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడానికి ఆ దేశంపై సైనిక చర్య చేపడతామని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడుల ద్వారా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. యుద్ధం కొనసాగితే ఇరాన్‌లో తీవ్ర విధ్వంసం తప్పదని ఆయన హెచ్చరించారు.