పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్-1 పరిధిలోని ఒక బొగ్గు గనిలో క్షుద్ర పూజల వ్యవహారం బయటపడింది. సింగరేణికి చెందిన ఒక ఉద్యోగి క్షుద్ర ముగ్గులను తన కాళ్లపై వేసుకుని తోటి ఉద్యోగులకు ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సమాచారం.

ఈ క్షుద్ర పూజల వల్ల భయపడిన ఒక ఉద్యోగి మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలయ్యాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు కూడా తోటి ఉద్యోగులు భయపడుతున్నారు. కనీసం తమ పేర్లు బయటకు వస్తాయేమోనన్న ఆందోళనతో వారు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

గతంలో కూడా రామగుండం రీజియన్ పరిధిలోని ఒక గని విభాగంలో ఇలాంటి క్షుద్ర పూజల ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఈ తరహా సున్నితమైన అంశాలు కార్మికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయని, సింగరేణి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక వర్గం కోరుతోంది.