స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో గురువారం అర్ధరాత్రి కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు జరిగాయి. గ్లాస్గోలోని ఓవో హైడ్రో వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒక భవనం లోపల ప్రారంభోత్సవం జరగడం ఇదే మొదటిసారి.
ఈ వేడుకల్లో లేజర్ షో, సాంస్కృతిక మరియు సాహస కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ సైక్లిస్ట్ క్రిస్ హోయ్, డాక్టర్ హూ టార్డిస్ నుంచి రాజు చార్లెస్, రాణి కామిలా వేదికపైకి ప్రవేశించారు. కేటి టన్‌స్టాల్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, కాల్లమ్ బిటి, నీనా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్, సెయింట్ ఫీనిక్స్ తమ ప్రదర్శనలతో సందడి చేశారు.
ఈ క్రీడల్లో భారత్‌తో సహా మొత్తం 74 దేశాలు పాల్గొంటున్నాయి. సుమారు 3 వేల మంది అథ్లెట్లు పరేడ్ ఆఫ్ నేషన్స్‌లో భాగస్వాములయ్యారు. భారత బృందానికి స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బోర్గొహెన్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.








