Gen Z యువత విలాసాలకు, విహారయాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనేది అపోహ మాత్రమేనని ఈ అధ్యయనం తేల్చింది. వీరు తమ నెలవారీ ఆదాయంలో 70 శాతానికి పైగా మొత్తాన్ని ఇంటి అవసరాలు, డిజిటల్ బిల్లుల వంటి నిత్య జీవిత ఖర్చులకే కేటాయిస్తున్నారు.

ఖర్చులలో అత్యధికంగా 20.1 శాతం వాటా విద్యుత్ బిల్లులు, ఇతర డిజిటల్ సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్తోంది. ఆ తర్వాత స్థానంలో నిత్యావసర వస్తువులు 15.7 శాతంతో ఉండగా, ఈఎంఐలు అంటే నెలవారీ వాయిదాల చెల్లింపులకు 12.2 శాతం, షాపింగ్‌కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు.

యువతకు ప్రయాణాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ, వారి నెలవారీ బడ్జెట్‌లో విహారయాత్రలకు కేవలం 5 శాతం మాత్రమే ఖర్చవుతోంది. వినోదానికి సంబంధించి జియో హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, స్పోటిఫై వంటి డిజిటల్ వేదికల సబ్‌స్క్రిప్షన్‌లకు వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు.

వయస్సు పెరిగేకొద్దీ వీరి ఆర్థిక బాధ్యతల్లో మార్పులు వస్తున్నాయి. 18-23 ఏళ్ల వయస్సు వారిలో నిత్యావసర ఖర్చులు 50 శాతంగా ఉండగా, 24-29 ఏళ్ల గ్రూప్‌లో అది 59 శాతానికి పెరిగింది. అయితే, వ్యక్తిగత సరదాల కోసం చేసే ఖర్చు మాత్రం రెండు గ్రూపుల్లోనూ 32 శాతం వద్దే స్థిరంగా ఉంది.

యూపీఐ, ఆటోపే — అంటే నిర్ణీత తేదీన బ్యాంక్ ఖాతా నుంచి బిల్లులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే సౌకర్యం — వంటి డిజిటల్ సాధనాలతో వీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారని SalarySe సహ వ్యవస్థాపకుడు పియూష్ బగారియా తెలిపారు. యువత బాధ్యతాయుతమైన ఆర్థిక జీవితాన్ని గడుపుతున్నారని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.