విశాఖపట్నంలో పుట్టి పెరిగిన మాలినీ దాసరి, వైద్య విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వైద్యశాలకే పరిమితం కాకుండా 'వాక్ బియాండ్ ద వైట్ కోట్' (వైద్య వృత్తికి మించి సేవలు అందించే కార్యక్రమం) పేరుతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఇటీవల అమెరికా అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షుల నుంచి ఆమె అవార్డు అందుకున్నారు. ఫ్యాకల్టీ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెంటర్‌షిప్, మిసెస్ ఇండియా వరల్డ్-2025, మిసెస్ ఇండియా యూఎస్ఏ-2024 వంటి పలు గుర్తింపులు తనకు లభించాయని ఆమె పేర్కొన్నారు. అయితే అవార్డుల కంటే సమాజానికి సేవ చేయడమే తనకు ముఖ్యమని ఆమె తెలిపారు.
అమెరికాలోని మిత్రుల ద్వారా సంకల్ప కళా గ్రామం గురించి తెలుసుకున్న మాలినీ దాసరి, తన పిల్లలకు తానే రోల్ మోడల్ (ఆదర్శం)గా ఉండాలనే ఉద్దేశంతో వారిని వెంట తీసుకుని అక్కడికి వచ్చారు. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు, సహజ రంగులతో తయారు చేసిన వస్త్రాలు, కొయ్య బొమ్మలు, కట్టె గానుగ నూనెలు, ఔషధ మొక్కలను చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మట్టితో ప్రతిమలను తయారు చేసే ప్రక్రియ ఆరోగ్యకరమైనదని ఆమె కొనియాడారు. ఈ పర్యటనలో మాలినీ దాసరితో పాటు ఆమె తల్లి దాసరి లక్ష్మీకుమారి, కుమార్తెలు జి. సమైక్య, జి. సమైన పాల్గొన్నారు. సంకల్ప కళా గ్రామం ప్రతినిధులు ఆమెను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళా గ్రామం వ్యవస్థాపకుడు ఆకుల చలపతిరావు, పర్యావరణ కార్యకర్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అభిమానులు, సంస్థ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








