అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూ రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. ఆయనకు కొత్త కిడ్నీ అవసరమని డాక్టర్లు చెప్పగా, కుటుంబ సభ్యులు దాత కోసం ప్రయత్నించినా ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో 2025 జనవరిలో వైద్యులు ఆయనకు జెనెటికల్లీ ఎడిటెడ్ పంది కిడ్నీని అమర్చారు.

ఈ సర్జరీ వైద్య చరిత్రలో మొదటిదని మాస్ బ్రిగ్ హామ్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆండ్రూ ఆ పంది కిడ్నీ సాయంతో 271 రోజుల పాటు డయాలసిస్, అంటే రక్తాన్ని శుద్ధి చేసే యంత్రం అవసరం లేకుండా జీవించగలిగారు. ఇది ఒక వైద్య అద్భుతమని వారు పేర్కొన్నారు.

అయితే 271 రోజుల తర్వాత ఆ పంది కిడ్నీలో సమస్యలు మొదలయ్యాయి. కిడ్నీలోని సూక్ష్మ రక్తనాళాలలో గాయాలు, వాపు ఏర్పడటంతో వైద్యులు ఆ కిడ్నీని తొలగించారు. ఆండ్రూకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల, రోగనిరోధక శక్తిని అణచివేసే వ్యవస్థ దెబ్బతినడమే ఈ సమస్యకు కారణమని వైద్యులు వివరించారు.

పంది కిడ్నీని తొలగించిన తర్వాత ఆండ్రూ కొన్ని రోజులు డయాలసిస్ మీద ఉన్నారు. ఆ తర్వాత 2026లో ఆయనకు మనిషి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.

మనుషులలో అవయవాల కొరతను తీర్చడానికి ఇలాంటి ప్రయోగాలు వైద్య రంగంలో విస్తృతంగా జరుగుతున్నాయి. జంతువుల నుంచి సేకరించిన అవయవాలను మనిషి శరీరం పరాయి వస్తువుగా గుర్తించి తిరస్కరిస్తుంది. దీనిని నివారించడానికి ఆధునిక సాంకేతికతతో జంతువుల జన్యువులలో మార్పులు చేసి, హానికరమైన వైరస్‌లను తొలగిస్తారు.

రోగి శరీరం కొత్త అవయవాన్ని స్వీకరించేలా చేయడానికి వైద్యులు రోగనిరోధక శక్తిని నియంత్రించే ప్రత్యేక మందులను ఇస్తారు. ప్రాణాలను కాపాడటానికి జెనెటికల్లీ ఎడిటెడ్ పంది కిడ్నీలు, గుండెలను అమర్చే ఈ ప్రయోగాలు భవిష్యత్తులో కీలకమని వైద్యులు భావిస్తున్నారు.