ఆదివారం రాత్రి ఖతార్‌లోని రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జీ (ద్రవీకృత సహజ వాయువు) కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది భారతీయులు మృతిచెందగా, మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఖతార్ అధికారులు సోమవారం స్పష్టం చేశారు.
ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. నిన్న రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్లు ఖతార్ అధికారులు నిర్ధారించారని, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పేర్కొంది.
మొత్తం 66 మంది కార్మికులు ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ మాట్లాడుతూ, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందిస్తున్నామని, వారిలో ఎవరి ప్రాణాలకూ ప్రమాదం లేదని తెలిపారు.
మార్చి నెలలో ఇరాన్ దాడి తర్వాత నిలిపివేసిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు మంత్రి సాద్ అల్-కాబీ వెల్లడించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని రాయబార కార్యాలయం ప్రకటనలో కోరింది.








