భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయ పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తలకు అంతరిక్ష అధ్యయనానికి కొత్త అవకాశాన్ని కల్పించింది. ఎక్స్‌పోశాట్ మిషన్ నుంచి లభిస్తున్న డేటాను ఉపయోగించుకోవాలని సంస్థ స్పష్టంగా సూచించింది.

అంతరిక్షంలోని తీవ్ర పరిస్థితుల్లో ఉండే కృష్ణబిలాలు (బ్లాక్‌హోల్స్), న్యూట్రాన్ నక్షత్రాలను అర్థం చేసుకోవడానికి ఈ డేటా సహాయపడుతుంది. పాలపుంతల కేంద్రకాల నుంచి వెలువడే విస్ఫోటనాలు, ఎక్స్‌రే కిరణాల అధ్యయనానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్) అనేది 2024 జనవరి 1న ప్రయోగించిన ఉపగ్రహం. ప్రస్తుతం ఇది భూ ఉపరితలానికి 650 కిమీ దూరంలో, భూమధ్యరేఖకు సమీపాన ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది.