తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహార ఉత్పత్తిదారులైన రైతులకు మద్దతుగా నిలబడేందుకు ఖమ్మం జిల్లా కేంద్రంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఉద్దేశ్యంతో ఈ నెల 30వ తారీఖున మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
సోమవారం చింతకాని మండలానికి వచ్చిన భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సభా స్థలాన్ని పరిశీలించారు. అధికారులు గుర్తించిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యం పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలో భాగంగా జరగబోయే సభకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.








