తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ మైదానంలో జరిగిన పోరులో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ వారియర్స్ నిర్దేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించి, 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ విజయంలో మెదక్ కెప్టెన్, టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. కేవలం 52 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్స్‌ల సహాయంతో 136 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్, శృజిత్ రెడ్డి చెరో 25 పరుగులు చేసి జట్టు విజయంలో దోహదపడ్డారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ కెప్టెన్ అమన్ రావ్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ, మధుకర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ చెరో వికెట్ తీశారు.

వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు తీశారు. ఈ ఘన విజయంతో మెదక్ ఫాల్కన్స్ తెలంగాణ టీ20 లీగ్‌ను శుభారంభం చేసింది.