హౌరాకు చెందిన 15 ఏళ్ల జాతీయ స్థాయి రైఫిల్ షూటర్ దమయంతి సేన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా హౌరా రైల్వే స్టేషన్‌లోని 4, 5 ప్లాట్‌ఫామ్‌లపై దమయంతి తిరుగుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. ఆమె తనతో పాటు మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లినప్పటికీ, అది పనిచేయకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెంచుతోంది. దమయంతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
దమయంతి జాతీయ జట్టు ట్రయల్స్‌కు ఎంపికైన ప్రతిభావంతమైన క్రీడాకారిణి. ప్రతిరోజూ తెల్లవారుజామునే షూటింగ్ సాధన చేసే ఆమె, ఇటీవల ట్రయల్స్‌కు ఎంపిక కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేవని వారు పేర్కొన్నారు.
యువ క్రీడాకారిణి అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్వచ్ఛందంగా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో ప్రత్యేక బృందాలు అనుమానాస్పద ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.








