ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఒక కేఫ్‌లో పార్టీ చేసుకున్న తర్వాత 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి ఎనిమిది మంది కలిసి ప్రీత్ విహార్‌లోని ఒక కేఫ్‌కు వెళ్లారు. రాత్రి 11:30 గంటలకు కేఫ్ మూసివేసినప్పటికీ, ఆ బృందంలోని ఒకరి వద్ద తాళాలు ఉండటంతో లోపలికి వెళ్లి పార్టీ చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు మద్యం సేవించి పార్టీ కొనసాగించారు.

పార్టీ ముగిసిన తర్వాత కేఫ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, మరో ఇద్దరు మహిళలతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో కొందరు కారులో వెళ్తున్న దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేఫ్‌లో ఉన్న వ్యక్తుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఆధారంగా ఘటన జరిగిన తీరును విశ్లేషిస్తున్నారు.

బాధిత యువతి కర్కర్‌డూమాలోని ఒక కేఫ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న మరికొందరు కూడా ఈ ఘటనలో పాలుపంచుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.