భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయించాలని కేంద్రం ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో కాక రేగుతోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. 2020 తర్వాత బహిరంగ వేలం లేకుండా, నామినేషన్ పద్ధతిలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గని దక్కడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించి, 2013లో యూపీఏ హయాంలో మొదలైన ఈ ప్రక్రియను తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేశామని క్రెడిట్ తీసుకున్నారు. అయితే, బీజేపీ మాత్రం 2020 మైనింగ్ పాలసీ ప్రకారం వేలం అనివార్యమని, సింగరేణి మనుగడ కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే నామినేషన్ పద్ధతి సాధ్యమైందని గట్టిగా వాదిస్తోంది.
ఈ వివాదంలో బీఆర్ఎస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. గతంలో తాడిచర్ల-1 బ్లాక్ కేటాయింపులో ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి లాభాలు గడించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ, ప్రస్తుతం సింగరేణికే పూర్తి హక్కులు రావడంపై నోరు విప్పలేకపోతోంది. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే లూప్‌హోల్స్‌కు అడ్డుకట్ట పడటంతో బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో నేరుగా ఢీకొని సింగరేణి ప్రయోజనాలకు గండి పడకూడదని భావిస్తూ, బయట రాజకీయ విమర్శలు చేస్తూనే లోపల కేంద్ర నిర్ణయాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో ఉంది. తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపు వెనుక అభివృద్ధి కనిపిస్తున్నా, కిషన్ రెడ్డి కాషాయ జెండాకు మైలేజ్ ఇచ్చుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్ దానిని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది.







