బుధవారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై ఖర్గే నుంచి మార్గనిర్దేశం పొందినట్లు నేతలు తెలిపారు.
ఈ భేటీకి ముందు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి, సీతక్క, సచిన్ సావంత్ సహా పలువురు సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీల పురోగతిపై ఇక్కడ సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని పెంచాలని నాయకత్వం దిశానిర్దేశం చేసింది. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల పనితీరును మెరుగుపరచడం, సభ్యత్వ నమోదును విస్తరించడంపై చర్చించారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధిష్ఠానం సూచించింది.








