కలియుగ వైకుంఠం తిరుమలలో శుక్రవారం ఆణివార ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై ఘంటా మండపానికి చేరుకున్నారు. అదే సమయంలో విష్వక్సేనుల వారు కూడా కొలువుకు వేంచేపు చేశారు.

ఈ వేడుకలో భాగంగా ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఉన్న ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పెద్దజీయర్ స్వామి ఆరు పట్టు వస్త్రాలను తలపై ఉంచుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. వీటిలో నాలుగు వస్త్రాలను మూలవిరాట్టుకు, మిగిలిన రెండింటిని మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి అలంకరించారు.

ప్రధాన అర్చకులు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకుని, స్వామివారి నుంచి బియ్యపు దక్షిణ స్వీకరించి ఆశీర్వచనం పలికారు. ఆ తర్వాత టీటీడీ ఈవో, పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములకు వరుస క్రమంలో ఆలయ తాళపు చెవి గుత్తిని అందించారు. చివరగా శఠారి మర్యాదలు పూర్తి చేసి, ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థాన కార్యక్రమం ముగిసింది.