బ్రెజిల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక పంటి నొప్పితో జుయిజ్ డి ఫోరా విశ్వవిద్యాలయంలోని దంత వైద్యశాలకు వెళ్ళింది. పరీక్షల కోసం డాక్టర్లు ఆమెకు ఎక్స్-రే తీయగా, నోటిలో మొత్తం 81 దంతాలు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు.

సాధారణంగా మనుషులకు 32 దంతాలు, చిన్నారులకు 20 పాల దంతాలు ఉంటాయి. అయితే, ఈ బాలిక నోటిలో 18 పాల దంతాలు, 32 శాశ్వత దంతాలతో పాటు అదనంగా మరో 31 దంతాలు ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు.

ఇలా దంతాలు అసాధారణ సంఖ్యలో పెరిగే స్థితిని 'హైపర్డోంటియా' అని పిలుస్తారు. 30 కంటే ఎక్కువ దంతాలు ఉండటం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఈ వింత పరిస్థితికి సంబంధించి 2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్ అనే వైద్య పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది.

ఈ అదనపు దంతాలు రావడానికి గల ఖచ్చితమైన కారణాలను శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేదు. దంతాల పెరుగుదలకు కారణమయ్యే కణజాలం (డెంటల్ లామినా) అతిగా పనిచేయడం లేదా జన్యుపరమైన కారణాలు దీనికి దారితీసి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.

ఈ బాలిక కుటుంబంలో ఎవరికీ ఇలాంటి సమస్య లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, ఈ బాలిక పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.