బిగ్‌బాస్ హౌసులో నవంబర్ 13న ఫ్యామిలీ వీక్ సందడి నెలకొంది. ఈ ఎపిసోడ్లో భాగంగా త్రిగుణ్ భార్య, కూతురు హౌసులోకి రాగా, త్రిగుణ్ తన భార్యతో మాట్లాడుతూ వర్షిణి వల్ల తాను చాలా బాధపడ్డానని చెప్పాడు. ట్రోఫీని ఎలాగైనా గెలవాలని త్రిగుణ్ భార్య అతడిని కోరింది. కాసేపు పాపతో అందరూ ఆడుకున్న తర్వాత వారు బయటకు వెళ్లారు.
ఆ తర్వాత నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్, వారి కూతురు లోపలికి వచ్చారు. గేమ్ ఆడుతున్నప్పుడు కంగారు పడొద్దని, ఏడవద్దని నటరాజ్ తన భార్యకు ధైర్యం చెప్పాడు. అయితే, నటరాజ్ గేమ్ అని మర్చిపోయి కాసేపు ఓవరాక్షన్ చేశాడు.
కుటుంబ సభ్యుల సందడి ముగిశాక, ఇంటికి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. స్కూల్ టాస్క్‌లో అందరూ బాగా ఆడినందుకు, హౌసులోని కంటెస్టెంట్స్ అందరికీ కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీపడే అవకాశం ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
ఈ టాస్క్ కోసం నేల మీద నంబర్లు ఉన్న షీట్లను బిగ్‌బాస్ ఏర్పాటు చేశాడు. బిగ్‌బాస్ ఒక నంబర్ చెప్పగానే, కంటెస్టెంట్స్ ఆ షీట్ మీద నిలబడాలి; నిలబడలేని వారు ఎలిమినేట్ అవుతారు. చివరకు మిగిలిన నలుగురు తర్వాతి దశకు వెళ్తారని బిగ్‌బాస్ నిబంధన పెట్టాడు.
ఈ ఆటలో కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు తోసుకుంటూ, కొట్టుకుంటూ తీవ్రంగా పోటీ పడ్డారు. సుధీర్ మొదటగా ఎలిమినేట్ అవ్వగా, ఆ తర్వాత వర్షిణి, రాంప్రసాద్, నీతూ, దేబ్జానీ, శ్వేత, ముకేశ్ బయటకు వచ్చారు. స్థానం కోసం తోపులాటలో త్రిగుణ్, శివ్ కూడా ఎలిమినేట్ అయ్యారు.
చివరగా వంశీ, నరేశ్, అమన్, రామకృష్ణ మాత్రమే మిగిలి తర్వాతి దశకు చేరుకున్నారు. ఈ కెప్టెన్సీ గేమ్ శనివారం కొనసాగుతుందని బిగ్‌బాస్ ప్రకటించడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.







