ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవ్వడం లేదా ఖాతాపై లీన్ మార్క్ పడటం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. లీన్ మార్క్ అంటే మీ ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి లేదా పంపడానికి వీలు లేకుండా బ్యాంకు విధించే తాత్కాలిక నిషేధం. చట్టపరమైన ఉత్తర్వులు, సైబర్ క్రైమ్ ఫిర్యాదులు లేదా అనుమానాస్పద లావాదేవీల వల్ల బ్యాంకులు ఈ మార్క్ వేస్తాయి.

ఖాతా ఫ్రీజ్ అవ్వడం అంటే మీ అకౌంట్ పూర్తిగా స్తంభించిపోవడం. దీనివల్ల మీరు ఖాతాను ఎక్కడా ఉపయోగించలేరు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడటం, అపరిచితులతో లావాదేవీలు జరపడం, తెలియకుండానే సైబర్ నేరగాళ్ల డబ్బును మీ ఖాతా ద్వారా పంపడం వంటి కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఒక సైబర్ క్రైమ్ కేసులో అనేక ఖాతాలు అనుమానిత జాబితాలోకి వస్తాయి కాబట్టి, మీకు సంబంధం లేకపోయినా ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఈ సమస్య ఎదురైనప్పుడు ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు అధికారులను సంప్రదిస్తే సైబర్ క్రైమ్ విభాగానికి వెళ్లమని, అక్కడికి వెళ్తే మీరు ఏదో నేరం చేసి ఉంటారని అధికారులు అంటున్నారని బాధితులు చెబుతున్నారు. బ్యాంకులు, సైబర్ క్రైమ్ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేసుకోవడం వల్ల ఖాతాలోని డబ్బు నిలిచిపోయి ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయకండి. ఎవరైనా అత్యవసరమని డబ్బు అడిగితే నగదు రూపంలో సహాయం చేయడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు చేయాల్సి వస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేయడం ఉత్తమం.