బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి పంపేందుకు భారత్ రెండు ప్రధాన షరతులు విధించింది. ఆమె భద్రతకు, న్యాయ విచారణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇవ్వాలని భారత్ కోరుతోంది. ఈ మేరకు బీబీసీ బంగ్లా కథనం వెల్లడించింది.
మొదటి షరతు ప్రకారం, హసీనాను బంగ్లాదేశ్ తీసుకెళ్లే బాధ్యతను ఆ దేశ సైన్యమే తీసుకోవాలి. ఆమె ఢిల్లీ నుంచి విమానంలో వెళ్లినా లేదా భూమార్గంలో ప్రయాణించినా, బంగ్లాదేశ్ సైన్యం ఆమెను స్వీకరించాలని భారత్ సూచించింది. ఇందుకోసం అవసరమైన రవాణా ఏర్పాట్లలో సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
రెండవ షరతుగా, హసీనాపై బంగ్లాదేశ్ కోర్టులు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని భారత్ కోరుతోంది. ఆమెకు న్యాయమైన విచారణ జరగాలని, ఉరిశిక్ష అమలు చేసేలా ఆమెను అప్పగించలేమని భారత విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ప్రక్రియలో రెండు దేశాల సైనిక వ్యవస్థలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఈ అంశంపై చర్చించేందుకు అక్టోబర్ మొదటి వారంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది ఢిల్లీకి వచ్చి, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్తో సమావేశమయ్యారు. హసీనా తిరుగు ప్రయాణంలో బంగ్లా సైన్యం చురుకైన పాత్ర పోషించేలా చూడటమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. నవంబర్ 9న హసీనా కొత్త పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా బంగ్లా ప్రభుత్వంతో తొలిసారి సంప్రదింపులు జరిపారు.
మరోవైపు, హసీనాకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్ సహా ఏ దేశమూ ముందుకు రాలేదని బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రెస్ సెక్రటరీ కేఎం నజ్ముల్ హక్ పేర్కొన్నారు. అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాతే ఆమె స్వదేశానికి తిరిగి వస్తున్నారని ఆయన ఆరోపించారు. హసీనా దరఖాస్తుపై ఢాకా నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని సమాచారం.








