గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ నిషేధంపై విస్తృత ప్రచారం జరుగుతోంది. 2026 ఆగస్టు 25 రాత్రి నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ పనిచేయదని, ప్రభుత్వం దీనిపై నిషేధం విధించిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తమ డేటాను, ఫొటోలను భద్రపరుచుకోవాలని పలువురు సూచనలు కూడా చేస్తున్నారు.

అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఖండించింది. ఇన్‌స్టాగ్రామ్ నిషేధంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కానీ, మెటా సంస్థ కానీ ఇన్‌స్టాగ్రామ్ నిషేధంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దేశంలో ఇన్‌స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని, ధృవీకరించకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని అధికారులు సూచించారు.

ప్రభుత్వ విధానాలు లేదా కీలక నిర్ణయాలకు సంబంధించిన వార్తలను నమ్మే ముందు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వంటి విశ్వసనీయ వనరుల ద్వారా మాత్రమే నిజానిజాలను నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు.