బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ వంటి దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్ వంటి పదార్థంతో చేసిన) నోట్లను ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసిన 'టాల్లో' అనే పదార్థాన్ని వాడుతున్నారు. నోట్లు యంత్రాల్లో అంటుకోకుండా, ప్రింటింగ్, కటింగ్ ప్రక్రియలు వేగంగా సాగేందుకు ఈ రసాయనం సహాయపడుతుంది.

2016లో బ్రిటన్ 5, 10 పౌండ్ల పాలిమర్ నోట్లను విడుదల చేసినప్పుడు, అందులో జంతువుల కొవ్వు ఉన్నట్లు బయటపడింది. దీనిపై హిందూ, సిక్కు, శాకాహార సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. వివాదం పెరగడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్పందిస్తూ, పామాయిల్ వాడకం పర్యావరణానికి హానికరమని భావించి జంతువుల కొవ్వును వాడుతున్నామని వివరణ ఇచ్చింది.

ఇప్పుడు భారత్‌లో కూడా పాలిమర్ నోట్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇతర దేశాల్లో జరిగిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ పాలిమర్ నోట్లలో జంతువుల కొవ్వు వాడకూడదని ప్రభుత్వం నిబంధన విధించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి. ఇవి తేమకు పాడవవు, చినిగిపోవు. వీటిలో ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను కూడా చేర్చనున్నారు, దీనివల్ల నకిలీ నోట్ల తయారీ కష్టమవుతుంది.

తొలుత రూ. 10, రూ. 20 విలువైన పాలిమర్ నోట్లను విడుదల చేయాలని RBI భావిస్తోంది. ఈ పాలిమర్ షీట్ల కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. వచ్చే ఏడాదిలో ఈ కొత్త నోట్లను ప్రజల్లోకి తీసుకురావడానికి RBI సిద్ధమవుతోంది.