భద్రాచలం రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసశాస్త్రి పాములు పట్టడంలో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఏపీలోని నర్సీపట్నంకు చెందిన ఈయన 20 ఏళ్లుగా భద్రాచలంలో నివాసం ఉంటున్నారు. సారపాక ఐటీసీ పీఎస్‌పీడీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తూనే, సమాచారం అందిన వెంటనే పాములను పట్టుకోవడానికి వెళ్తుంటారు.

15 ఏళ్ల క్రితం తన ఇంట్లోకి వచ్చిన పామును పూర్వీకుల నుంచి నేర్చుకున్న విద్యతో సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టడంతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాగుపాము, కట్లపాము, రక్తపింజరు వంటి విషపూరిత సర్పాలతో పాటు కొండచిలువలను కూడా ఆయన భయం లేకుండా బంధిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 3 వేల పాములను పట్టుకుని నిర్మానుష్య అటవీప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

పాములు పట్టుకునే క్రమంలో రెండుసార్లు ప్రమాదానికి గురైనప్పటికీ, ఎవరి సాయం కోరకుండా సొంత ఖర్చులతోనే చికిత్స చేయించుకున్నారు. తన సేవలను గుర్తించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల శాస్త్రిని అభినందించారు.

అయితే, పాములు పట్టుకోవడానికి సరైన పరికరాలు లేవని శాస్త్రి చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాములు పట్టుకునే స్టిక్, బూట్లు, యూనిఫాం వంటివి అందిస్తే మరింత సురక్షితంగా సేవలు అందించవచ్చని ఆయన కోరుతున్నారు.