హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయి. బుధవారం నాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాస్త్రోక్తంగా రథోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పక్షాలు అందించిన సహకారం ఎంతో ఉందని తలసాని పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితోనే కల్యాణం, రథోత్సవం ఘనంగా నిర్వహించగలిగామని ఆయన తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో వినోద్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.