అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద గత నెల జూలై 26న భారత, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. సాధారణ ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇరు దేశాల సైనికులు ఎదురుపడగా, చైనా సైనికులు ఇంగ్లీషులో ఒక బ్యానర్‌ను ప్రదర్శించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

ఈ ఘర్షణ వారం రోజుల పాటు కొనసాగింది. అయితే, రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం సరిహద్దులో ఎలాంటి ఉద్రిక్తతలు లేవని సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గతంలో 2017లో డోక్లాం సెక్టార్‌లో, 2020 జూన్‌లో లదాఖ్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. 2020 నాటి లదాఖ్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా సైనికులు కూడా మరణించినప్పటికీ, ఆ దేశం అధికారికంగా ఆ సంఖ్యను వెల్లడించలేదు.

ఇటీవల చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను తన భూభాగంగా పేర్కొంటూ మ్యాప్‌లను విడుదల చేయడంతో పాటు, ఆ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలకు కొత్త పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని రెండు రోజుల క్రితం కూడా కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.