ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఎదురైన క్లిష్ట దశ గురించి ఆయన కుమారుడు, నటుడు ఆకాష్ పూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకానొక సమయంలో తమ కుటుంబం ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందంటే, కనీసం పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టలేని స్థితికి చేరుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రోజుల్లో పూరి జగన్నాథ్ తన స్నేహితులకు ఫోన్ చేసి, ఆ పెంపుడు కుక్కలను తీసుకెళ్లమని కోరాల్సి వచ్చిందని ఆకాష్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా బహిరంగంగానే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్నవారు ఎవరూ తమకు అండగా నిలబడలేదని, తన తండ్రి ఒంటరిగా మిగిలిపోయారని ఆకాష్ తెలిపారు.
ఆ సమయంలో ఆకాష్ మూడో తరగతి, అతని చెల్లి రెండో తరగతి చదువుతున్నారు. తాము చిన్నపిల్లలం కాబట్టి కష్టాలు తెలియకూడదని భావించిన తల్లి, వారిద్దరినీ హాస్టల్‌లో చేర్పించారు. హాస్టల్‌లో ఉన్నప్పుడు తమ తండ్రి పెద్ద దర్శకుడని, అంతా బాగుందని తాము భావించామని ఆకాష్ చెప్పారు.
కొన్నాళ్ల తర్వాత హాస్టల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన వివరించారు. తాము వేసుకునే బట్టలు, తినే ఆహారం, ఉంటున్న ఇల్లు ఇలా అన్నీ మారిపోయాయని ఆకాష్ పేర్కొన్నారు. సుమారు ఐదు, ఆరు సంవత్సరాల పాటు తమ జీవితం చాలా నరకంగా గడిచిందని ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో తాము ఉన్న ఇల్లును, కార్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆకాష్ చెప్పారు. ఒకప్పుడు తమ వద్ద రెండు మూడు కార్లు ఉండేవని, వాటిని చూసి ప్రజలు తమకేం తక్కువ అని అనుకునేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, తన తండ్రి ఆ కష్టాల నుంచి తిరిగి నిలబడటం ఒక అద్భుతమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ తన తండ్రి మళ్లీ తిరిగి నిలబడకపోయి ఉంటే, తాను బహుశా నేడు 'నెపోకిడ్' (సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి) అనే మాట వినకుండా, ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే సాధారణ నటుడిగానే ఉండేవాడినని ఆకాష్ చెప్పారు.






