ఒకప్పుడు స్టార్ యాంకర్ గా గుర్తింపు పొంది, నటిగా కూడా సినిమాలు చేసిన ఉదయభాను ప్రస్తుతం నిర్మాతగా మళ్లీ బిజీ అయ్యారు. తాను నిర్మిస్తున్న పంచనామా సిరీస్ ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన డబ్బింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
శ్రీ ఆంజనేయం సినిమాలో నటి ఛార్మి పాత్రకు తాను డబ్బింగ్ చెప్పానని ఉదయభాను చెప్పారు. ఛార్మి మాట్లాడే తీరును, ఆమె శైలిని అనుకరిస్తూ వాయిస్ మార్చి చెప్పడంతో, అది తన గొంతు అని ఎవరూ గుర్తించలేకపోయారని ఆమె తెలిపారు.
అయితే, ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ డబ్బింగ్ క్రెడిట్స్ జాబితాలో తన పేరును చేర్చలేదని ఉదయభాను అసహనం వ్యక్తం చేశారు. పేరు వేయకపోవడం వల్లే తాను డబ్బింగ్ చెప్పిన విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత కూడా చాలా మంది డబ్బింగ్ చెప్పమని అడిగినా, తాను తిరస్కరించానని ఆమె చెప్పారు. ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి నాలుగు ఐదు రోజులు సమయం పట్టేదని, అప్పట్లో తనకు అంత సమయం, ఓపిక లేకపోవడంతో ఆ పనిని ఆపేశానని ఆమె వివరించారు.
పెళ్లి, పిల్లల బాధ్యతల వల్ల కెరీర్‌లో గ్యాప్ తీసుకున్న ఉదయభాను, ఇప్పుడు నటిగా మరియు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన డబ్బింగ్ అనుభవంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దర్శకుడు కృష్ణవంశీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.







