సండే లేదా ప్రత్యేక సందర్భాల్లో నాన్-వెజ్ ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. గ్రేవీ లేదా సుక్కా కాకుండా, ఘుమఘుమలాడే మసాలాలతో ఆంధ్రా స్టైల్ మటన్ ఆయిల్ ఫ్రైని తయారు చేయడం చాలా సులభం. ఇది పప్పుచారు, వంకాయ కూరలతో పాటు వేడి అన్నంలోకి అద్భుతమైన రుచిని ఇస్తుంది.

ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి 4 నుండి 5 విజిళ్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మటన్ ముదురుగా ఉంటే మరో రెండు, మూడు విజిళ్లు అదనంగా రానివ్వాలి.

స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఈ మిశ్రమంలో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆపై ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను రసంతో సహా బాణలిలో వేయాలి. మటన్‌లోని నీరంతా ఇంకిపోయి, మసాలాలు ముక్కలకు పట్టి నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఫ్రై చేయాలి.

చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుంటే ఘుమఘుమలాడే స్పైసీ మటన్ ఆయిల్ ఫ్రై సిద్ధమవుతుంది.