పిల్లలు బడి నుంచి రాగానే ఏదైనా కొత్తగా తినాలని మారాం చేస్తుంటారు. ప్రతిరోజూ పకోడీలు, శాండ్‌విచ్‌లు పెడితే వారికి బోరు కొడుతుంది, అందుకే ఈసారి మునగకాయతో స్నాక్ ట్రై చేయండి. ఇది రుచిగా ఉండటమే కాకుండా, సాయంత్రం వేళ టీతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

ముందుగా మునగకాయలను శుభ్రంగా కడిగి, రెండు అంగుళాల పొడవు ఉండేలా ముక్కలుగా కోసుకోవాలి. వీటిని కుక్కర్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, ముక్కలను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పది నిమిషాల పాటు నానబెట్టిన శనగపప్పు, బియ్యాన్ని మిక్సీలో వేయాలి. ఇందులో జీలకర్ర పొడి, ఆమ్ చూర్ పొడి (మామిడికాయ పొడి), ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం మరీ పల్చగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు.

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. ఉడకబెట్టిన మునగకాయ ముక్కలను సిద్ధం చేసుకున్న పిండిలో ముంచి, పిండి ముక్కకు అన్ని వైపులా పట్టేలా చూసుకోవాలి.

ఈ ముక్కలను కాగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ముక్కలను అటూ ఇటూ తిప్పుతూ లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇలా చేస్తే మునగకాయ స్నాక్స్ కరకరలాడుతూ సిద్ధమవుతాయి.