అల్లూరి సీతారామరాజు జిల్లా ఇర్లపల్లి గ్రామానికి చెందిన ముర్రం శివానీ అనే పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, ఏపీఎఫ్ఎస్ఎల్ (APFSL) బృందాలు ఆధారాలను సేకరించాయి.

మూడు రోజుల క్రితం రంపచోవరంలో జరిగిన ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో శివానీ పాల్గొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి భోజనం చేసిన ఈ బాలిక, వారితో సెల్ఫీ కూడా దిగింది. ఆ కార్యక్రమంలో తన ప్రసంగంతో ముఖ్యమంత్రిని ఆకట్టుకున్న శివానీ, వచ్చే ఏడాది ‘షైనింగ్ స్టార్’ అవార్డు గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి అభినందించారు.

శివానీ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తల్లిదండ్రులు విడిపోయి ఉండటం, కుటుంబం కలవాలని కోరుకుంటూ ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్ల క్రితమే విడిపోయిన తల్లి సౌభాగ్యవతి, తండ్రి మురళీకృష్ణలను పోలీసులు విచారించారు. ఆదివారం తండ్రి వద్దకు వచ్చిన శివానీ సాయంత్రం వరకు అక్కడే ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివానీ మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మీయులతో సమస్యలను పంచుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ నరేంద్ర ప్రసాద్ తెలిపారు.