అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం, లింకన్ పట్టణానికి చెందిన ఇన్‌మాకులాడా జాక్‌మన్ కుటుంబం 2021లో తమ పెంపుడు కుక్క 'చాంగ్'ను కోల్పోయింది. ఇంటి నుంచి తప్పించుకున్న చాంగ్ కోసం వారు నెలల తరబడి వెతికినా ఫలితం లేకపోయింది. ఆ కుటుంబం మరో కుక్క 'చె చె'ను పెంచుకుంటున్నా, చాంగ్ తిరిగి వస్తుందనే ఆశను మాత్రం వదులుకోలేదు.
ఐదేళ్ల తర్వాత జాక్‌మన్‌కు ఒక స్నేహితురాలు సోషల్ మీడియా పోస్టును పంపింది. లింకన్‌కు సుమారు 642 మైళ్ల దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని ఒక ట్రక్ స్టాప్ వెనుక చాంగ్ కనిపించినట్లు అందులో ఉంది. వెంటనే జాక్‌మన్ హెండ్రిక్స్ కౌంటీ జంతు సంరక్షణ కేంద్రాన్ని సంప్రదించి, అది తమ కుక్కేనని ధృవీకరించారు.
అయితే, చాంగ్‌కు ఎవరో కొత్తగా మైక్రోచిప్ అమర్చడంతో సాంకేతిక సమస్య ఎదురైంది. నిబంధనల ప్రకారం, ఆ చిప్‌లో నమోదైన వ్యక్తికి స్పందించేందుకు మూడు రోజుల గడువు ఇవ్వాల్సి ఉంది. ఆ గడువులోగా ఎవరూ ముందుకు రాకపోవడంతో, జంతు సంరక్షణ కేంద్రం చాంగ్‌ను తిరిగి జాక్‌మన్‌కు అప్పగించింది.
జాక్‌మన్ ఇండియానాకు వెళ్లి చాంగ్‌ను ఇంటికి తీసుకువచ్చారు. జంతు సంరక్షణ కేంద్రం విడుదల చేసిన వీడియోలో, ఐదేళ్ల తర్వాత యజమానిని చూసిన చాంగ్ మొదట అయోమయంగా కనిపించినా, ఆ తర్వాత జాక్‌మన్‌ను హత్తుకుంది. ఆశను ఎప్పుడూ వదులుకోవద్దని, ఐదేళ్ల తర్వాత కూడా తాము చాంగ్‌ను తిరిగి పొందామని జాక్‌మన్ డబ్ల్యూకేఆర్‌సీకి తెలిపారు.






