మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పార్లీ ప్రాంతానికి చెందిన దహిఫలే కుటుంబంలో దాదాపు 200 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఐదు తరాలుగా కేవలం మగపిల్లలే పుడుతున్న ఈ వంశంలోకి, తాజాగా ఒక ఆడబిడ్డ అడుగుపెట్టింది. కల్పన రిషికేష్ దహిఫలే ఈ పాపకు జన్మనిచ్చారు.
కుటుంబ సభ్యులు ఆ చిన్నారికి ‘గార్గి’ అని పేరు పెట్టారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, తల్లిని, నవజాత శిశువును ఇంటికి తీసుకువచ్చేందుకు కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పూలతో అలంకరించిన ఒక రథంలో వారిని కూర్చోబెట్టి, డప్పులు, తాళాల వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఈ వేడుకల్లో స్థానికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దహిఫలే కుటుంబం ఆ చిన్నారిని యువరాణిలా చూసుకుంటోంది. తమ కుటుంబంలో కుమార్తె పుట్టడం గొప్ప అదృష్టమని, ఏళ్ల నాటి వెలితి తీరిపోయిందని పాప తాత లింబాజీ దహిఫలే సంతోషం వ్యక్తం చేశారు.
పాప అమ్మమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ, లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోందని చెప్పారు. సమాజంలో చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారని, కానీ ఆడపిల్ల తెచ్చే ఆనందమే వేరని తండ్రి రిషికేష్ తెలిపారు. కుమార్తెను అపురూపంగా పెంచుకుంటామని ఆయన చెప్పారు.
సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను పోగొట్టడమే ఈ వేడుకల ఉద్దేశమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆడబిడ్డ జననం అనేది ఎంతో సంతోషకరమైన, గర్వించదగ్గ విషయమని సమాజానికి సానుకూల సందేశం ఇవ్వడానికే తాము ఈ ఘనమైన ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు.








