పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉన్న చారిత్రక గురుద్వారా శ్రీ గురు సింగ్ సభను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం, ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివసించిన సిక్కులకు ప్రధాన ప్రార్థనా కేంద్రంగా ఉండేది. సిక్కుల ఆధ్యాత్మిక సంస్కృతికి, చారిత్రక వారసత్వానికి ఇది చిహ్నంగా నిలిచింది.
ఈ గురుద్వారా స్థానంలో షాపింగ్ మాల్ నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కూల్చివేత చేపట్టింది. అయితే, ఈ స్థలాన్ని ఒక ప్రైవేటు బిల్డింగ్‌కు విక్రయించినట్లు అక్కడి సిక్కు నాయకుడు ఒకరు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
ఈ ఘటనపై స్థానిక సిక్కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం భవన కూల్చివేత మాత్రమే కాదని, తమ మతపరమైన సంప్రదాయాలను, జ్ఞాపకాలను చెరిపేసే ప్రయత్నమని వారు విమర్శిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 12 చారిత్రక గురుద్వారాలు ఉండగా, ప్రస్తుతం కేవలం రెండు మాత్రమే మిగిలాయి.
ఈ కూల్చివేతను నిరసిస్తూ సిక్కు సంఘాలు బలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్టు నిరాకరించింది.








