ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో వెంకటాపూర్ గ్రామం ఉంది. 120 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో మొత్తం జనాభా 684 మంది కాగా, వారిలో 310 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడం విశేషం. ఒకప్పుడు సరైన రహదారి సౌకర్యం లేక, మండల కేంద్రానికి వెళ్లాలంటే ఎడ్ల బండిపై గంటల తరబడి ప్రయాణించాల్సిన దుస్థితి ఉండేది.
1969లో రూపావత్ బనియా (బలిరాం) అనే వ్యక్తి ఈ గ్రామం నుండి మొదటిసారిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించడంతో మార్పు మొదలైంది. ఆ సమయంలో గ్రామంలోని 50 కుటుంబాల వారు నిరాక్షరాస్యులుగా ఉండేవారు. బనియా తన గ్రామంలో మార్పు కోసం తోటి యువకులను చదువు వైపు ప్రోత్సహించడమే కాకుండా, తన సంతానాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాల దిశగా నడిపించారు.
ఆయన చూపిన బాటలో నడిచిన గ్రామస్తులు ఇరవై ఏళ్ల కాలంలోనే 50 మందికి పైగా ప్రభుత్వ కొలువులు సాధించారు. క్రమంగా ఈ సంఖ్య పెరిగి, ఇప్పుడు గ్రామ జనాభాలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండగా, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్, అటవీశాఖ, పంచాయతీరాజ్, రైల్వే, వ్యవసాయం, ఎక్సైజ్, ఐసీడీఎస్ (పిల్లలు, తల్లుల సంక్షేమం చూసే శాఖ), వైద్య ఆరోగ్య శాఖ వంటి పలు విభాగాల్లో సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం గ్రామంలో 310 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉండగా, వారిలో 100 మంది ఆడపడుచులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 80 మంది ఉపాధ్యాయురాళ్లు కాగా, మిగిలిన వారు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల్లో పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన మరో 90 మంది మహిళలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం.
ఈ గ్రామానికి కోడళ్లుగా వచ్చిన వారిలో కూడా 50 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండటం విశేషం. ఒకప్పుడు కనీస రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామం, నేడు విద్యా చైతన్యంతో మండల కేంద్రానికే తలమానికంగా నిలిచింది.








