ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. మహిళా కార్యకర్తల మధ్య మొదలైన వాదన చిలిపి గొడవగా మారి, వారి వర్గీయులు రంగంలోకి దిగడంతో పరిస్థితి చేయిచేసుకోవడం వరకు వెళ్లింది. ఈ ఘటనలో కొందరు సిగ పట్లు పట్టుకుని కొట్టుకున్నారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తర్వాత ఇన్‌ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన చుండూరి రవిబాబు తీరుపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవిబాబు తన అభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించిన వారిపై సస్పెన్షన్లకు పాల్పడుతున్నారని, తన అనుచరుల ద్వారా వార్నింగులు ఇప్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలినేనితో సంబంధాలు ఉన్నారనే ఆరోపణలపై మహిళా నేతలు బడుగు ఇందిర, ప్రమీలను సస్పెండ్ చేయించారని విమర్శలు ఉన్నాయి.
కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఇన్‌ఛార్జ్ ఫొటో చిన్నగా ఉందనే కారణంతో రవిబాబు వర్గీయులు దాడికి పాల్పడ్డారని సమాచారం. అంతేకాదు, జిల్లా అధ్యక్షుడు సహా ముఖ్య నేతలు కార్యాలయానికి వచ్చినా రవిబాబు సమయానికి రాకపోవడంపై కూడా అసహనం వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా, బయట మరోసారి దాడులు జరిగినా ఇన్‌ఛార్జ్ పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ పరిణామాలపై జిల్లా నాయకత్వం పార్టీ అధిష్టానానికి వివరాలు అందించడంతో హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. దీంతో వైసీపీ నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసి, వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒంగోలు వైసీపీలో నెలకొన్న ఈ అంతర్గత కలహాలకు అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.








