అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి వంటి కానుకల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సభ్యులందరినీ ప్రభుత్వమే నియమించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ సభ్యులంతా ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి మరియు వాటి అనుబంధ సంస్థలకు చెందినవారని వారు గుర్తు చేశారు. ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రెటరీ ప్రధానికి అత్యంత సన్నిహితుడని లేఖలో ప్రస్తావించారు.
ఈ వ్యవహారంపై విచారణ నివేదికను, ట్రస్ట్ ఖాతాల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని వారు కోరారు. విరాళాల దుర్వినియోగంపై లేఖలో ప్రస్తావించినా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని వారు ప్రశ్నించారు.








